వర్షాకాలం వస్తే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వేసవి తప్ప మిగిలిన రెండు సీజన్లలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో ఎక్కువగా కన్పించే ప్రాణాంతక వ్యాధి డెంగ్యూ. అయితే చాలామంది డెంగ్యూని గుర్తించడంలో విఫలమై లేదా నిర్లక్ష్యం వహించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మరి డెంగ్యూని ఎలా గుర్తించాలనేది తెలుసుకుందాం..
వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉండవచ్చు గానీ ఆరోగ్యపరంగా చాలా సవాళ్లు విసురుతుంటుంది. ముఖ్యంగా వైరల్ ఫీవర్, జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతుంటాయి. ఇందులో డెంగ్యూ అత్యంత ప్రమాదకరమైంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకంగా మారుతుంది. కానీ చాలామంది డెంగ్యూని సకాలంలో గుర్తించడంలో విఫలం కావడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిపోతుంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో తలెత్తే సాధారణ జ్వరాలు, డెంగ్యూ మధ్య అంతరం గుర్తించడంలో సమస్య ఎదురౌతుంది. అందుకే మీ కోసం డెంగ్యూ వర్సెస్ జ్వరం లక్షణాలు ఎలా ఉంటాయనే వివరాలు..
జ్వరంతో పాటు బాడీ పెయిన్స్ వచ్చి ఎంతకీ తగ్గకపోయినా తేలిగ్గా తీసుకుంటారు. పరీక్ష చేయిస్తే గానీ డెంగ్యూ అని తేలదు. డెంగ్యూ అనేది దోమకాటు కారణంగా వస్తుంది. డెంగ్యూ సోకినప్పుుడు రక్తంలో ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా తగ్గి ప్రాణం మీదకు వస్తుంది. అందుకే డెంగ్యూ వచ్చినప్పుడు అప్రమత్తత చాలా అవసరం. సకాలంలో గుర్తించగలగాలి.
డెంగ్యూ లక్షణాలు ఇలా
డెంగ్యూ వచ్చినప్పుడు జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే 103-104 డిగ్రీల వరకు ఉండవచ్చు. తల నుదుటి భాగంలో విపరీతమైన తలనొప్పి ఉంటుంది. కనుగుడ్డు వెనుక భాగంలో నొప్పి బాధిస్తుంది. వీటికితోడు ఒళ్లంతా తీవ్రమైన నొప్పులుంటాయి. ముఖ్యంగా కండరాలు, కీళ్లలో నొప్పి ఉంటుంది. ఇక ఆకలి లేకపోవడం లేదా వికారంగా ఉండటం ఉంటుంది. నీరసం చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ప్లేట్‌లెట్స్ సంఖ్య గణనీయంగా అంతకంతకూ తగ్గిపోతుంటుంది.
ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడే డెంగ్యూ సోకిందో లేక సాధారణ వైరల్ ఫీవర్ అనేది తెలుస్తుంది. సకాలంలో మందులు వాడితే సులభంగా తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదకరం. ఇక చుట్టుపక్కల ప్రాంతాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు ఎక్కడా నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమల బెడద ఉంటే దోమ తెరలు, క్రీమ్స్ వాడితే మంచిది. నిద్రించేటప్పుడు పూర్తిగా శరీరాన్ని కప్పుకోవాలి.