ఈరోజుల్లో నిద్రలేమితో ఇబ్బందిపడే వాళ్లు చాలా ఎక్కువయ్యారు. మారిన జీవన శైలి, ఒత్తిడి..ఇలా ఎన్నో కారణాల వల్ల ఈ మధ్య కాలంలో చాలామంది ఈ సమస్యకు గురవుతున్నారు. ఇది అనేక రకాల ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. మన రోజువారీ పనితీరు పైన నిద్రలేమి ఎంతో ప్రభావం చూపుతుంది.నిపుణుల సలహా ప్రకారం తక్కువ నిద్ర, ఎక్కువ నిద్ర.. రెండూ ఆరోగ్యానికి ప్రమాదమే. అయితే.., రోజుకి సగటున ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఏ సమయంలో నిద్రపోవాలి? నిద్రలేమికి కారణాలు,పరిష్కారాలు ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా మనలో చాలామంది నిద్ర విషయంలో చాలా అశ్రధ్ద గా ఉంటాం. సమయానికి నిద్రపోకపోవడం,తగినంత సేపు నిద్రపోకపోవడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాం. నిపుణుల సలహా ప్రకారం రోజుకి ఎనిమిది గంటల నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే,కనీసం ఆరు గంటలైనా నిద్రపోవాలనేది నిపుణుల సూచన. ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే దాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కంటే ఎక్కువ నిద్రపోతే దాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యం పై దుష్ప్రభావం చూపిస్తాయి.
నిద్రలేమికి చాలా కారణాలుంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగం నిద్రలేమికి ఒక ప్రధాన కారణం.సెల్ ఫోన్స్ నుంచి, కంప్యూటర్స్ నుంచి వచ్చే కాంతి వల్ల కళ్లు విపరీతంగా అలసిపోతాయి. వయసుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో చాలామంది ఈ ఎలక్రానిక్ గాడ్జెట్స్ కు అతిగా అలవాటు పడిపోతున్నారు. రాత్రిపూట ఎక్కువసేపు కంప్యూటర్ లేదా సెల్ల్ ఫోన్ చూస్తూ ఉండడం వల్ల వాటి ప్రభావం కళ్ల మీద పడి నిద్ర పట్టదు. అందువల్ల వీలైనంత వరకు లేట్ నైట్ చాటింగ్ లు,ఫోన్ సంభాషణలు తగ్గించుకుంటే మంచిది.
అలాగే,రాత్రిపూట టీ ,కాఫీలు తాగడం అనేది కూడా నిద్రలేమికి ఒక ముఖ్యమైన కారణం. వీటిలో ఉండే కెఫిన్ అనే పదార్ధం వల్ల నిద్ర పట్టదు. అందువల్ల నిద్రపోయే ముందు టీ,కాఫీలు తాగడం మానేయాలి. ఇక, నిద్రపోయే గది శుభ్రంగా లేకపోవడం కూడా నిద్రలేమికి ఒక కారణం. బట్టలన్నీ చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ ఉండడం లేదా వస్తువులన్నీ అస్తవ్యస్తంగా పడి ఉండడం వల్ల మనం నిద్రపోవడానికి ప్రశాంతంగా ఉండదు. అదే విధంగా ఒకే బెడ్ షీట్ ను మార్చకుండా మళ్లీ మళ్లీ వాడడం అనేది కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది.
సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరం నిద్రకు ఉపక్రమించదు. పగలంతా ఎక్కువగా తిరిగే వారికి శరీరం బాగా అలసిపోవడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది. ఎక్కువగా తిరిగే అవసరం లేనివాళ్లు తగినంత వ్యాయామం చేయాలి. అసలు శరీరానికి శ్రమ అనేదే లేకపోతే నిద్ర పట్టడం చాలా కష్టం. అందువల్ల వాకింగ్ లేదా జిమ్ చేయడం వల్ల శరీరం బాగా అలసిపోయి,త్వరగా నిద్రపట్టే అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్రలేమిని అధిగమించవచ్చు.