ఇటీవలి కాలంలో అత్యంత ప్రమాదకరంగా మారిన వ్యాధి డయాబెటిస్. చాపకింద నీరులా విస్తరిస్తోంది. నియంత్రణే తప్ప సరైన చికిత్స లేకపోవడంతో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. అయితే తాజాగా కొన్ని అధ్యయనాలు షుగర్ వ్యాధిగ్రస్థులకు శుభవార్త అందిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఎదుర్కొనే వ్యాధుల్లో డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. నిర్లక్ష్యం వహిస్తే ఎంత ప్రమాదకరమో నియంత్రణ కూడా అంతే సులభం. మధుమేహానికి చికిత్స లేకపోయినా నియంత్రణ అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా వెలువడిన కొన్ని అధ్యయనాలు డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు బిగ్ రిలీఫ్ ఇస్తున్నాయి. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయాలంటే ఎలాంటి ఫుడ్స్ అవసరమో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నిరంతరం బ్యాలెన్స్ చేసేందుకు దోహదపడే ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
దాల్చిన చెక్క, మెంతుల పౌడర్ డయాబెటిస్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండింటి పౌడర్‌ను గ్లాసు నీళ్లలో మరిగించి రోజూ పరగడుపున తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. ఇక బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్ వంటివి తరచూ తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్లు, గుడ్ ఫ్యాట్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇక రోజుకు ఒక్కసారి ముఖ్యంగా మద్యాహ్నం పెరుగు తీసుకోవడం మర్చిపోకూడదు. దీనివల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది.
ఇక భోజనంలో క్వినోవా, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు చేర్చుకుంటే శరీరానికి కావల్సినంత ఫైబర్ అందుతుంది. షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడంలో ఫైబర్ కీలకపాత్ర పోషిస్తుంది. అదే విధంగా పాలకూర, బచ్చలికూర వంటి ఆకు కూరలు వారంలో కనీసం 2-3 సార్లు తీసుకోవాలి. నాన్ వెజ్ విషయంలో సాల్మన్, మ్యాకెరెల్, ట్రూనా వంటి ఫ్యాటీ చేపలు చాలా మంచివి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది.
ఇక వెజిటేరియన్ ఫుడ్ విషయంలో ఆకు కూరలతో పాటు చిక్కుళ్లు, పెసలు, శెనగలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల ఫైబర్ అందుతుంది. వారంలో కనీసం ఒకసారి కాకరకాయ కూర లేదా జ్యూస్, మునగాకు కూర తినాలి. క్యారట్ వంటి దుంపలు అధికంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఏవి తిన్నప్పుడు ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. ఆహారంలో ఈ మార్పులతో పాటు రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చాలా అవసరం.