ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. వీటిలో ముఖ్యమైంది మలబద్ధకం. మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆధునిక లైఫ్‌స్టైల్, వివిధ రకాల జంక్ ఫుడ్స్ కారణంగా కడుపు సంబంధిత సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి. అన్ని వ్యాధులకు మూలం కడుపు. కడుపు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఎలాంటి సమస్యలు రావు. మనం తినే చెడు తిండి అలవాట్ల కారణంగా కడుపు సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో తరచూ విన్పించే సమస్య మలబద్ధకం. అంటే రోజూ విసర్జన సరిగ్గా కాకపోవడం లేదా విసర్జన సమయంలో మంట నొప్పి ఉండటం. ఈ సమస్య పూర్తిగా మన తిండి అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఎంత నరకప్రాయంగా ఉంటుందో అంతే సులభంగా నయం చేసుకునే సమస్య. సులభంగా కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మలబద్ధకం నయం చేసే చిట్కాలు
జీలకర్ర, సోంపు నీళ్లతో మలబద్ధకం సమస్యను చాలా సులభంగా నయం చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు. జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల కడుపులో గ్యాస్, మంట, మలబద్ధకం వంటి సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కడుపులో గ్యాస్ బయటకు పంపిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ వేగవంతమై మలబద్ధకం తగ్గుతుంది. జీలకర్రతో మెటబోలిజం వేగవంతమౌతుంది. కడుపు సంబంధిత సమస్యలు తొలగుతాయి. అదే విధంగా సోంపు కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. కడుపు నొప్పి తగ్గుతుంది.
ఒక టీ స్పూన్ జీలకర్రను గ్లాసు నీళ్లలో తీసుకుని బాగా మరిగించాలి. ఆ తరువాత వడకట్టి గోరు వెచ్చగా సేవించాలి. రోజూ రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఒక స్పూన్ సోంపుని ఓ గ్లాసు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత వడకట్టి గోరు వెచ్చగా సేవించాలి. ఈ రెండింట్లో ఏది పాటించినా మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు.