వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైన్ షాపు నుంచి మద్యం తాగి బయటకు వస్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డుపై దారుణంగా పొడిచి చంపారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగింది? ఒకేసారి ఇద్దరి యువకులను హత్య చేయడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వైఎస్ఆర్ కడప జిల్లాలో మళ్లీ నెత్తుటేరులు పారాయి. విషయం ఏంటంటే? కడప టౌన్ లో రేవంత్ (27), అభిలాష్ (29) అనే ఇద్దరు స్నేహితులు నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరు స్నేహితులు టౌన్ లో ఉన్న ఓ బార్ లోకి వెళ్లారు. ఇక అక్కడికి వెళ్లాక ఇద్దరు మద్యం సేవించారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు అని ఇద్దరు బార్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే వారి కోసం కాపుకాచి కూర్చుకున్న నలుగురు యువకులు అందరూ చూస్తుండగానే రేవంత్, అభిలాష్ లను కత్తులతో పోడిచి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ దాడిలో రేవంత్ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అభిలాష్ కొన ప్రాణాలతో కనిపించాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. రేవంత్ అప్పటికే చనిపోగా, అభిలాష్ చికిత్స పొందుతు ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాతకక్షలే ఈ దారుణానికి కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. ఇకపోతే తొందర్లోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఉన్నట్టుండి కడపలో మళ్లీ నెత్తుటేరులు పారడంతో స్థానికంగా కలకలంగా మారుతుంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.