ఈ మధ్య కాలంలో చిన్న, చిన్న కారణాలే తోటి మనుషుల ప్రాణాలు తీసే వరకు వెళుతున్నాయి. డబ్బుల విషయంలో గొడవలు జరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు. స్నేహితుల మధ్య కూడా డబ్బు విషయంలో వివాదాలు జరిగి ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతుంటారు. చివరికి హత్యలకు దారి తీస్తాయి. తాజాగా రూ.100 అప్పు తిరిగి ఇవ్వనందుకు రుణం ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తిని హత్య చేశాడు ఈ దారుణమైన ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
మహరాష్ట్రలోని దహిసర్ ప్రాంతంలో ఓ వ్యక్తి రూ.100 రూపాయలు తిరిగి ఇవ్వలేదని స్నేహితుడిని చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్నీ పరిశీలించారు. అనంతరం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. “రూ.100 తిరిగి ఇవ్వలేదని మనస్సులో కక్ష పెంచుకుని, ఇనుప పైపుతో స్నేహితుడిని కొట్టి చంపాడు. అనంతరం ఆధారాలు లేకుండా చేయడం కోసం స్నేహితుడి మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు” అని దహిసర్ డీసీపీ సోమనాథ్ గార్గే తెలిపారు. రూ.100 కోసం హత్య చేయడం.. డబ్బు కోసం మరీ ఇంతగా తెగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.