సమాజంలో ఉండే ప్రత్యేకమైన మానవ సంబంధాల్లో భార్యాభర్తల బంధం ఒకటి. రెండు విభిన్న ఆలోచనలు, శరీరాలు కలిగిన వ్యక్తులు పెళ్లి అనే కార్యంతో భార్యాభర్తలుగా ఒకటవుతారు. దాంపత్య జీవితంలో చిన్న పాటి గొడవలు అనేది సర్వసాధారణం. గొడవలు పడని భార్యాభర్తలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కొందరు భర్తలు.. మద్యానికి బానిసలు గా మారి భార్యలను శారీరకంగా, మానసికంగా హింసిస్తుంటారు. మరికొందరు అయితే తాము అనుకున్న కోరికలు తీర్చలేదని, ఇతర కారణాలతో భార్యను హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఇప్పటి అనేకం జరిగాయి. తాజాగా అలాంటి ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మారుతి నగర్ చెందిన ఖాజా, జుబేదాబీ భార్యాభర్తలు. నంద్యాల జిల్లా డోన్ మండలం నక్కవాగుపల్లికి చెందిన ఈ జుబేదాబీతో ఖాజాకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. చాలా కాలం పాటు ఆ దంపతుల సంసారం హాయిగానే సాగింది. ఖాజా వృత్తిరీత్య కారుడ్రైవర్. తనకు సొంతంగా ఓ కారు కావాలని, పుట్టింటి నుంచి డబ్బులు తెమ్మని గత కొన్నిరోజుల నుంచి భార్యను వేధిస్తున్నాడు. ఇదే సమయంలో మద్యానికి బానిసైన ఖాజా రోజూ తాగి వచ్చి జుబేదాబీతో గొడవ పడేవాడు. అంతేకాక ఖాజా ఆమెను శారీరకంగా వేధిస్తూ నిత్యం ఘర్షణ పడేవాడు. అతడు ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన ఆమె భరిస్తూ సంసారాన్ని నెట్టుకొస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం మరోసారి ఆ దంపతలు మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
ఖాజా సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఆ పై హత్య నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్యకు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా చీరతో ఆమె గొంతును బలంగా బిగించి ఇంటిలో వేలాడదీశాడు. ఆ తరువాత జుబేదాబీ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు మంగళవారం గుత్తికి వెళ్లారు. అక్కడ కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అల్లుడే తమ కుమార్తెను హత్య చేసినట్లు మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జుబేదాబీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.