ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో చాలానే ఘోరాలు జరుగుతున్నాయి. ప్రేమ అంటే అర్ధం తెలియని వయస్సులో.. ప్రేమ పంజరంలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు ప్రేమికులు పరువు హత్యలకు బలి అవుతున్నారు. మరికొందరు ప్రియుడి చేతిలోనే దారుణంగా చంపబడుతున్నారు. మరికొందరు పెద్దలు ఒప్పుకోలేదని ఇక బతకటమే వ్యర్ధమని ఆత్మహత్య చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ప్రేమజంట అలాంటి దారుణానికి ఒడిగట్టింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని చింత చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని బత్తులవారిపాలేనికి చెందిన బత్తుల పెద్ది రాజు(22) ఇంటర్ చదివి ఇటుక బట్టీల్లో పొట్టు లారీల పనికి వెళ్తున్నాడు. అద్దంకి పట్టణంలోని కొత్తపేటకు చెందిన పల్లపోతు ప్రశాంతి(20) ఇంటర్ వరకు చదివి ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. పట్టణంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొంతకాలానికి ప్రేమగా మారింది. అలా వీరిద్దరు దాదాపు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లికి సిద్దమయ్యారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో పెద్దలకు తెలిసింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించడటం లేదని ఇటీవలే ఇంటి నుంచి వెళ్లిపోయారు. ప్రశాంతిని గుర్తించిన పోలీసులు తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అనంతరం ఇద్దరి కుటుంబ సభ్యులకు పోలీసలు కౌన్సిలింగ్ ఇచ్చారు. యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. అయితే పెళ్లి చేయకుండా మాటలతో కాలం వెలదీస్తున్నారు. దీంతో మనస్థాపం చెందిన పెద్ది రాజు, ప్రశాంతి సోమవారం అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయారు. తెల్లవారు జామున కాకానికుంట బహిర్భూమికి వెళ్లిన వారికి చింత చెట్టుకు వెలాడుతూ పెద్ది రాజు, ప్రశాంతిలు కనిపించారు. అయితే అంతకు ముందే పెద్ది రాజు తన స్నేహితులకు మెసేజ్ చేశాడు. తాను క్షేమంగా ఉన్నట్లు స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఆ తరువాత చెట్టుకు ఉరి వేసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనల స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు.
ఇద్దరి మృతదేహాలను చెట్టుకు వేలాడుతూ ఉండటం చూసి.. ఇరుకుటుంబాల వారు భోరున విలపించారు. సిబ్బంది సాయంతో మృతదేహాలను కిందకు దించి.. పోస్టుమార్టం నిమితం ఆస్పత్రికి తరలించారు. తన బిడ్డ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్ది రాజు తండ్రి బత్తుల కృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరక అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు కుటుంబాల చెందిన వారు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరడంతో స్వల్ప ఉద్రికత్ నెలకొంది. తమకు న్యాయం చేయలంటూ మృతుడి తరపు వారు ఆందోళన చేపట్టారు.