నటుడు సోనూసూద్ అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి భారతీయుడికీ తెలుసు. కరోనా సంక్షోభ సమయంలో నటుడు సోను సూద్ నిస్వార్థంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు. వేలాది మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరుకోవడానికి సహాయం చేశాడు. విదేశాల్లోని వారిని ప్రత్యేక విమానాలు వేయించి రప్పించాడు. ఇలా ఎంతో మందికి తనవంతు సహాయాన్ని అందించాడు. కొంత మంది సోనూసూద్ పేరుతో మోసాలకు తెగబడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఓ మహిళను కొంత మంది సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్పి ఆన్ లైన్ లో ఆమె డబ్బు కాజేశారు. ఈ ఘటన రాజమండ్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
రాజమహేంద్రవరం కి చెందిన సత్యశ్రీ అనే మహిళకు 6 నెలల బాబు ఉన్నాడు. ఆ బాలుడు గత కొంత కాలంగా ఓ వ్యాధితో ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. తన బాబుకి వచ్చిన వ్యాధికి సత్యశ్రీ రూ.లక్షలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి. తన బాబు పరిస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా తనకు తెలిసిన వారికి.. బంధువులకు తెలియజేసింది. ఈ క్రమంలో సోనూసూద్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని.. మీ బాబుకి ఆర్థికంగా సహాయం చేస్తామని నమ్మబలికారు. తన బ్యాంక్ వివరాలు ఇస్తానని సత్యశ్రీ చెప్పినా.. అవసరం లేదు.. ఫోనులో ఎనీ డెస్క్ యాప్ ఇన్ స్టాల్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆమె పూర్తి వివరాలు యాప్ లో నమోదు చేశారు.
సత్యశ్రీ వద్ద బ్యాంక్ వివరాలు తీసుకున్న తర్వాత ఆమెకు నగదు రాకపోగా కొంత మంది ఆమె అకౌంట్ లో వేసిన డబ్బులు కూడా మాయం కావడం మొదలయ్యాయి. ఇలా ఆమె వద్ద రూ.95 వేల వరకు డబ్బులు మాయం అయ్యాయి. అసలు ఏం జరుగుతుంతో అర్థంకాని పరిస్థితిలో సత్యశ్రీ గురువారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన చిన్నారి కష్టాల్లో ఉన్నాడు.. అని తెలిపినా కూడా ఇలా తనను దారుణంగా మోసం చేశారని.. ఆ తల్లి బావురుమన్నది.
కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా తెలియని వారు ఫోన్ డిటేల్స్, ఓటీపీ అడిగితే వారి విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.