సాధారణంగా రాజకీయాల్లో పగలు, ప్రతీకారాలు సహజం. సొంత పార్టీ కార్యకర్తలు, లీడర్లు కానీ ప్రత్యర్థి పార్టీలకు మద్దతిచ్చినట్లు తెలిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయటమో లేదా గట్టిగా వార్నింగ్ ఇవ్వటమో జరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం సొంత పార్టీ నేత ప్రత్యర్ధి పార్టీకి మద్దతిచ్చాడని ఏకంగా కొబ్బరి తోటపై ఆ ప్రతీకారాన్ని తీర్చుకున్న ఘటన వెలుగు చూసింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ముమ్మాటికి నిజం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గనుక.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వెళ్దూరు గ్రామంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ప్రత్యర్ధి అభ్యర్ధికి మద్దతిచ్చాడనే నెపంతో కక్ష పెంచుకుని ఓ పార్టీకి చెందిన నేతలు మద్దతిచ్చిన వ్యక్తి కొబ్బరితోటను పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ దారుణమైన ఘటనపై స్పందించిన బాధితుడు బోరున విలపించాడు. 100పైగా కొబ్బరి చెట్లను నరికేశారని అంటూ బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.