గుంటూరులో రమ్య హత్య ఘటన మరువక ముందే మరో హృదయ విధారక ఘటన వెలుగు చూసింది. గుంటూరు జిల్లాలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. బాలిక నోట్లో వస్త్రాలు కుక్కి ఐదు గంటలు అత్యాచారం చేశారన్న విషయం తెలిసి అందరి కళ్లు చెమ్మగిల్లాయి. మరీ, గుంటూరు జిల్లాలో మహిళలపై దాడులు పెరిగిపోయాయంటూ ప్రభుత్వంపై విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఘటనపై గుంటూరు రూరల్ దిశ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దిశ డీఎస్పీ రవిచంద్ర ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. జీజీహెచ్‌లో ఉన్న బాలిక, కుటుంబసభ్యులను దిశ డీఎస్పీ రవి చంద్ర కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘కొద్దిరోజులుగా మా కుమార్తె అమ్మమ్మ దగ్గర ఉంటోంది. కొద్దిరోజుల కిందట ఆమె చనిపోవడంతో బుధవారం కర్మకాండల పనిలో ఉన్నాం. ఆ సమయంలో ఇద్దరు యువకులు బాలికను లాక్కెళ్లి, నోట్లో వస్త్త్రాలు కుక్కి… గదిలో బంధించి ఐదు గంటలు అత్యాచారానికి పాల్పడ్డారు’ అని బాలిక తండ్రి వివరాలు వెల్లడించాడు. మా పాప నరకయాతన అనుభవించింది. మా పాపకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదు. బాధ్యులను కఠింనంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ప్రతిపక్షం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఈ ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోర పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్ష నాయకులని తిట్టడం, కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రమ్య ఘటన మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం బాధాకరం. రాజుపాలెంలో దళిత మైనర్ బాలిక పై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రంలో ఉన్న ఘోరమైన పరిస్థితులకు అద్దంపడుతుంది. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో @ysjagan సర్కార్ పూర్తిగా విఫలమైంది.(1/2)
— Lokesh Nara (@naralokesh) August 19, 2021