తలచినదే జరిగినదా దైవం ఎందులకు? జరిగినదే తలచితివా ఎదురులేదు నీకు.. ఈ పాట అందరూ వినే ఉంటారు. అవును మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఎదురు ఉండదు. కానీ, విధి కొన్నిసార్లు మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది. అలా ఈ అమ్మాయిని వెక్కిరించిన విధి ఆమె తల్లిదండ్రుల జీవితాల్లో విషాద ఛాయలు నింపింది. అమ్మా బడికి వెళ్లొస్తానంటూ వెళ్లిన అమ్మాయి.. తిరిగి రాని లోకాలు వెళ్లిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్కపల్లిలో జరిగింది. తన్నీరు స్వామి, రజిత దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానం. కుమార్తె అమూల్య(15) సోమవారం తల్లిదండ్రులకు వెళ్లొస్తానని చెప్పి పాఠశాలకు బయల్దేరింది. ఎప్పటిలాగానే స్కూలు వాళ్లు ఏర్పాటు చేసిన ఆటో ఎక్కింది. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కొద్ది దూరం వెళ్లాక.. తన వాటర్ బాటిల్ కిందపడిపోయిందని ఆటో ఆపమని చెప్పింది.
ఆటో స్లో చేసేలోపే కిందకు దిగే ప్రయత్నం చేయడంతో అమూల్య రోడ్డుపై పడిపోయింది. ఆమె తలకు గాయాలు అయ్యాయి. వెంటనే గోదావరిఖనిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కరీంనగర్‌కు రిఫర్ చేశారు. కరీంగనర్ తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో అమూల్య ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అమూల్య ప్రాణాలు క్లోపోయిందంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థిని మృతికి బాధ్యత వహిస్తూ రూ.50 లక్షలు పరిహారం కూడా చెల్లించాలని కోరారు. గవర్నమెంట్ రూల్స్ కు వ్యతిరేకంగా వాహనాలు నడుపుతున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.