హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త నడి రోడ్డుపై కిరాతకంగా ఐరన్ రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ దాడిలో ఆ మహిళ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ మెహదీపట్నం పరిధిలోని లంగర్ హౌజ్ లో మహ్మద్ యూసుఫ్ (36), కరీనా బేగం (30) అనే దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి 7 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. కొన్నేళ్ల తర్వాత వీరికి ముగ్గురు చిన్నారులు జన్మించారు. ఇకపోతే రాను రాను భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. దీంతో భార్య కరీనా బేగం కొన్ని రోజుల నుంచి భర్తకు దూరంగా తన పిల్లలతో పుట్టింట్లో నివాసం ఉంటుంది. ఇక చేతిలో చిల్ల గవ్వ లేకపోవడంతో కరీనా బేగం స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేరింది. అలా కరీనా బేగం కొంత కాలం పాటు అక్కడే పని చేస్తుంది. ఈ క్రమంలోనే నా మాట వినడం లేదని భర్త యూసుఫ్ భార్యపై కోపంతో ఊగిపోయాడు.
ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం నీతో మాట్లాడాలని చెప్పి యూసుఫ్ భార్యను ఓ చోట కలుసుకున్నాడు. భార్యతో మాట్లాడుతున్నట్లు నటించిన యూసుఫ్.. వెంటనే తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్డుతో భార్యను దారుణంగా కొట్టి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.