ఈ మద్య కొంతమంది చిన్న చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడుతున్నారు. కొన్ని సమయాల్లో హత్యలు కూడా చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి దారుణాలు ఎక్కువగా డబ్బు, బంగారం, వివాహేతర సంబంధాల విషయాల్లో జరుగుతున్నాయి. ఆ మద్య ప్రకాశం జిల్లాలో బాలుడి వద్ద ఉన్న 40 రూపాయలు లాక్కోవడానికి దారుణ హత్యకు పాల్పపడ్డాడుఓ దుర్మార్గుడు. వంద రూపాయల కోసం స్నేహితుల మద్య గొడవ కారణంగా హత్య చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో ఘోరం చోటు చేసుకుంది. కేవలం రూ.400 కోసం స్నేహితుడిని హత్య చేసిన ఘటన బాలా నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరబాద్ బాలానగర్ లో కాశీరాం, శ్రీనివాస్ లు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు స్నేహితులు కావడంతో అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చిపుచ్చుకునేవాళ్లు. ఈ క్రమంలోనే ఇద్దరి మద్య రూ.400 విషయంలో వివాదం తలెత్తింది. నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్న ఫుట్ పాత్ పై ఇద్దరు గొడవకు దిగారు. ఇద్దరి మద్య ఘర్షణ పెద్దది కావడంతో ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే కాశీరాం కోపంతో ఊగిపోతూ.. దగ్గర ఉన్న కర్రతో శ్రీనివాస్ పై దాడికి పాల్పపడ్డాడు. అంతేకాదు అటుగా వస్తున్న లారీ కిందకు నెట్టివేయడంతో శ్రీనివాస్ కి తీవ్రంగా గాయాలై చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాశీరాం ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే పట్టపగలు విచక్షణ కోల్పోయి అన్యాయంగా ఓ నిండు ప్రాణాన్ని బలికొనడం స్థానికంగా కలకలం సృష్టించింది. స్నేహితుడు అని కూడా చూడకుండా శ్రీనివాస్ ని లారీ కింద తోసి హత్య చేసిన కాశీరాం కఠిన శిక్షపడేలా చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘర్షణ కు కారణాలు ఏంటీ? కేవలం రూ.400 కోసం హత్య చేశాడా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.