ప్రేమించుకోవడం.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం.. ధైర్యం చాలకపోతే.. ప్రాణాలు తీసుకోవడం.. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని చనిపోవడం.. లేదంటే చంపడం వంటి సంఘటనలు సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పనులు చేసే వారిలో చదువుకున్న వారు, చదువులేని వారు.. జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన వారు ఇలా అన్ని వర్గాల వారు ఉంటున్నారు. కొన్ని చోట్ల ప్రేమికులు ఇద్దరు బాగా చదువుకుని.. జీవితంలో స్థిరపడినప్పటకి.. కులాలు, మతాలు, అంతస్తుల పేరు చెప్పి.. పెళ్లికి అంగీకరించడం లేదు పెద్దలు. మరికొన్ని చోట్ల తమను ఎదిరించి పెళ్లి చేసుకుని.. పరువు తీశారని కక్ష్య పెంచుకుని.. కన్నవారినే బలితీసుకుంటున్న కసాయి తల్లిదండ్రుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీలో ప్రేమించిన వాడు దక్కడనే భయంతో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. చేతి మీద రాసిన సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన నిశ్చిత నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అయితే వీరి పెళ్లికి యువకుడి కుటుంబం అంగీకరించలేదని సమాచారం. దాంతో ప్రేమించిన వాడు తనకు దక్కడనే బాధతో నిశ్చిత ఆత్మహత్యాయత్నం చేసింది. మత్తు ఇంజక్షన్లు మోతాదుకు మించి తీసుకుంది. ఇక తాను చనిపోతే.. ప్రేమించిన వ్యక్తిని అనుమానిస్తారనే భయంతో.. చేతి మీద సూసైడ్ నోట్ రాసుకుంది.
ఈ క్రమంలో నిశ్చిత.. ‘‘నేను చేస్తున్న పనికి.. వంశీకి కానీ.. అతడి కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. వాళ్లని ఏమి చేయకండి ప్లీజ్’’ అని రాసుకుంది. ఇక నిశ్చిత పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఇక గతంలో కూడా ఇలానే ఆత్మహత్యాయత్నంచేసిందని.. అప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా మరోసారి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.