29 ఏళ్ల జాక్వి విలియమ్స్ ‘గ్రేవ్ మెటల్లమ్ జ్యువెలరీ’ సంస్థనే ఏర్పాటు చేసింది. చనిపోయిన వ్యక్తులు ఎప్పటికీ గుర్తిండిపోయేలా తమ వద్ద ఏదైనా వస్తువు ఉంటే బాగుంటుందని చాలామంది భావిస్తారు. అలాంటివారి కోసమే జాక్వి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. కుటుంబికులు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన దంతాలు, జుట్టు లేదా బూడిద ఏది తీసుకొచ్చినా జాక్వి వాటిని అందమైన నగలుగా మార్చేస్తుంది. జాక్వీ 2017లో జ్యువెలరీ తయారీలో డిప్లమా చేసింది. ఆ తర్వాత ఆమెకు ఎక్కడా ఉద్యోగం కూడా లభించలేదు. ఈ క్రమంలో ఎదురైన చేదు అనుభవాలు, ఫ్రెండ్ మరణం ఈ వ్యాపారానికి ప్రేరేపించాయి. ఒక్కో నగ తయారీ కోసం జాక్విన్‌కు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుంది. ఒక్కో పీస్ తయారీకి రూ.19,500 నుంచి రూ.5.5 లక్షల వరకు వసూలు చేస్తుంది. నగలను కేవలం చనిపోయిన వ్యక్తుల కుటుంబికుల కోసమే తయారు చేస్తోంది. కాబట్టి ఎలాంటి సమస్య లేదు.
తనకు రోజూ చాలారకాల రిక్వెస్టులు వస్తుంటాయని ఆమె తెలిపింది. కొన్నేళ్ల కిందట తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిందని, అప్పటి నుంచే తాను ఈ నగల తయారీ మొదలుపెట్టానని జాక్వీ పేర్కొంది. కోరిన విధంగా నగలను తయారు చేసి ఇస్తుంది. సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్, జెమ్‌స్టోన్స్‌తో ఆస్థికలను అందమైన నగలుగా మార్చుతోంది. జాక్వీ తయారు చేసిన నగలను తన ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రదర్శనకి పెట్టింది. నచ్చితే ఆర్డర్ ఇచ్చేయడమే.