ఇప్పటివరకు ఏటీఎం మిషన్ నుంచి నగదు బయటకు రావడం మనం చూశాం. ఇకపై బంగారం బయటకి రావడం కూడా చూడొచ్చు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎం నుంచి బంగారు నాణేలను బయటకు తీయొచ్చు. బంగారం ధర చెల్లించిన వెంటనే ఏటీఎం నుంచి నాణేలు బయటకు వస్తాయి. బేగంపేటలోని అశోక్ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎం ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
కొనుగోలుదారులు వారి డెబిట్, క్రెడిట్ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఈ ఏటీఎంలలో డ్రా చేసుకోవచ్చు. ఈ ఏటీఎం ద్వారా 99.99శాతం శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ తెలిపారు. బంగారు నాణేలతోపాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలూ జారీ అవుతాయని వెల్లడించారు. అదే విధంగా మార్కెట్ ధరకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బంగారం ధరలు ఏటీఎం స్క్రీన్ పైన కనిపించేలా ఏర్పాట్లు చేశారు. త్వరలో నగరంలోని గుల్జార్‌హౌస్, సికింద్రాబాద్, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లలో ఈ తరహా గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గోల్డ్ ఏటీఎంలు కూడా సాధారణ నగదు ఏటీఎం తరహాలోనే పని చేస్తాయి. ఏటీఎంకి స్వైప్ చేయడానికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. ఆ తర్వాత కొనుగోలుదారు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇచ్చిన ఎంపికను ఎంచుకోవాలి. అప్పుడు కొనుగోలుదారు ధరను ఎంచుకుంటారు. అక్కడే ఎంపిక చేసుకున్న బడ్జెట్ కు అనుగుణంగా అంతే విలువైన బంగారం ఏటీఎం నుంచి క్షణాల్లో అందుతుంది. ఈ ఏటీఎంలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు.. దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. నాలుగు రోజుల్లో ఏకంగా రూ.1000 మేర పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. ఆదివారం హైదరాబాద్ లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల(10 గ్రాములు) బంగారం ధర రూ.500 పెరిగి రూ.49,250కాగా, 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.550 పెరిగి రూ.53,730 వద్ద కొనసాగుతోంది.