ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి ఉద్యోగులకు ఆందోళన కలిగించాయి. తాజాగా ఫేస్ బుక్ సంస్థ కూడా తమ ఉద్యోగులకు గుండెల్లో బాంబు పేల్చింది. ఫేస్ బుక్ మాతృ సంస్థ.. మెటా ప్లాట్ ఫామ్స్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తమ కంపెనీలో పని చేస్తున్న 13 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక అయిన ఫేస్ బుక్ ద్వారా వచ్చే ఆదాయం పెద్దగా లేకపోవడం, పెరుగుతున్న ఖర్చులు, అడ్వర్టైజింగ్ మార్కెట్ బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల ఉద్యోగులను భరించడం కష్టంగా ఉందని మార్క్ అన్నారు.
ఖర్చులను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నిర్ణయానికి తాను జవాబుదారీగా ఉండాలనుకుంటున్నట్లు మార్క్ తెలిపారు. 2022 సంవత్సరంలోనే అతి పెద్ద ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇదేనని, ఈ విషయంలో తాను చాలా బాధపడుతున్నానని వెల్లడించారు. ఆ మధ్య కరోనా రావడం, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోవడం, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం.. వీటన్నిటికీ తోడు మార్క్ జుకర్ బర్గ్.. మెటావర్స్ అనే వర్చువల్ రియాలిటీ ప్రాజెక్ట్ లో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల సంస్థ నష్టాల్లో నడుస్తోంది. అందుకోసం 11 వేలకు పైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవ్వమని మంగళవారం నాడు అధికారులకి సూచించారు.
కంపెనీ చేస్తున్న ఈ తప్పుకి తాను జవాబుదారీగా ఉంటానని అన్నారు. 2004లో ఈ సంస్థ స్థాపించబడింది. ఈ కంపెనీని నమ్ముకుని 87 వేల మంది జీవిస్తున్నారు. 18 ఏళ్ల ఫేస్ బుక్ చరిత్రలో ఇంతమంది ఉద్యోగుల కోత విధించడం అనేది ఇదే తొలిసారి మరియు చీకటి అధ్యాయం కూడా. గత వారం ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ దాదాపు 50 శాతం ఉద్యోగులను తొలగించింది. ఈ తరహాలోనే స్నాప్ చాట్ యాప్ మాతృసంస్థ స్నాప్ ఇంక్ సంస్థ తన సంస్థ నుంచి 20 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆగస్ట్ నెలలో ప్రకటించింది. తాజాగా ఫేస్ బుక్ మాతృసంస్థ 11 వేలకు పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాను చేస్తున్న ఈ పనికి తనను క్షమించాలని సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.