ఇటీవల కొంతకాలం నుంచి సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి(46) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం పరిస్థితి బాగా విషమించింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గురువారం కర్నూలు జిల్లాలోని ఆయన స్వగ్రామమైన అవుకు మండలం ఉప్పలపాడులో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.
కర్నూలు జిల్లాకు చెందిన చల్లా భగీరథ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రపోషించాడు. 2003 నుంచి 2009 వరకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2007-08 మధ్యకాలంలో ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా తన సేవలు అందిచారు. 2019లో తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డితో కలిసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. 2021లో ఎమ్మెల్యే కోటా కింద భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం లభించింది. పదవిలో ఉండాగానే అనారోగ్య కారణంతో చల్లా భగీరథ రెడ్డి కన్నుమూశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. భగీరథ రెడ్డి భార్య లక్ష్మి ప్రస్తుతం అవుకు జడ్పీటీసీ గా ఉన్నారు.
చల్లా భగీరథ రెడ్డి మృతిపట్ల ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రుల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పాటు పలు పార్టీల నాయకులు భగీరథ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేశారు. తండ్రి చనిపోయి రెండేళ్లు కూడా గడవకముందే ఎమ్మెల్సీగా ఉన్న కొడుకు భగీరథరెడ్డి మృతి పట్ల బనగానపల్లె నియోజకవర్గం లో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. రేనాటి గడ్డలో తండ్రి కొడుకుల రాజకీయ నేపథ్యం మరువలేనిది.