ఈ మధ్యకాలంలో పెట్రోల్ రెట్లు విపరీతంగా పెరిగిపోతుండడంతో వాహనదారులు బయటకు బండి తీయాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోని ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మనం సాధారణంగా రోడ్డుపై వెళ్తున్న క్రమంలో మన బైక్ పంక్చర్ అయినా లేదంటే పెట్రోల్ అయిపోయినా మరే సమస్య వచ్చినా బైక్ ముందు తోయడానికి అనేక ఇబ్బందులు పడుతుంటాం. ఇక అటు నుంచి ఎవరైన తెలిసిన వ్యక్తులు బైక్ పై కనిపిస్తే వారి బైక్ సాయంతో ముందుకెళ్తాం.
కానీ పశ్చిమగోదావరి జిల్లాలోని ఇద్దరు యువకుల ఆలోచన తీరుకు మాత్రం వాహనదారులు ఆశ్చర్యపోతున్నారు. ఇక విషయం ఏంటంటే..? జిల్లాలోని కుక్కునూరు మండలం జిన్నాల గూడెంలో ఓ యువకుడు ఏదో పని నిమిత్తం బైక్ మీద బయటకు వెళ్లాడు. హఠాత్తుగా బైక్ రాడ్ విరిగిపోవడంతో బైక్ ముందుకు కదిలే ప్రసక్తే లేదు. దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక అటు నుంచి తెలిసిన యువకుడు సైకిల్ తో వస్తూ బైక్ సమస్యను పూర్తిగా తెలుసుకున్నాడు. కొద్దిసేపు ఇద్దరికి ఏం చేయాలో అస్సలు తోచలేదు.
వెంటనే ఇద్దరికి మైండ్ లో ఓ ఆలోచన వెలిగింది. ఓ పాత చీర సాయంతో బైక్ నుంచి సైకిల్ కట్టారు. ముందుగా సైకిల్ తోసి తోసి చివరికి ముందు సైకిల్ వెళ్తూ వెనకాల బైక్ తీసుకెళ్లారు. అలా రోడ్డుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన రోడ్డుపై వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఇక కొందరైతే వీడియోను తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. వీడియోను చూసిన కొందరు వీళ్లు మహాముదురులు.. సైకిలుండగా పెట్రోల్ ఎందుకు దండగా అనే రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ యువకుల వినూత్న ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.