లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. కానీ ఒకే ఒక్క తప్పు కారణంగా గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిన్నారు.
అసలే కుర్ర వయసు.. చేతిలో కారు తాళం ఉంది. ఇక ఎందుకు ఆగుతారు. తలో వంద ఏసుకుని షికారుకు బయలుదేరతారు. బాగా తిరిగి తిరిగి ఇంటికొస్తారు. చాలా ఎంజాయ్ చేశామని సోషల్ మీడియాలోనో, వాట్సాప్ స్టేటస్ లోనో పెట్టుకుని పడుకుంటారు. దాదాపు అందరు యువకుల విషయంలో జరిగేది ఇదే. కానీ ఈ యువకుల జీవితంలో మాత్రం ఊహించని ఘటన ఎదురైంది. కుదురుగా ఉండకుండా తుంటరి పని చేయడంతో గ్రామస్తులు చెట్టుకి కట్టేసి చితక్కొట్టారు. చెట్టుకి కట్టేసి కొట్టేంత తప్పు ఏం చేశారంటే?
పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెంకి చెందిన ఐదుగురు యువకులు కారులో లాంగ్ డ్రైవ్ కి బయలుదేరారు. అయితే కాళ్ళ మండలం కొనలపల్లి గ్రామ శివారులో అర్థరాత్రి సమయంలో పెట్రోల్ అయిపోవడంతో కారు ఆగిపోయింది. దీంతో యువకులు ఊరిలోకి వెళ్లి పెట్రోల్ దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఓ ఇంటి ముందు ఉన్న బైక్ లో పెట్రోల్ తీస్తూ అడ్డంగా దొరికిపోయారు యువకులు. ఇంటి యజమాని సత్యనారాయణ ఆరుబయట నిద్రిస్తుండడంతో అలికిడి వచ్చి లేచి చూడగా యువకులు పెట్రోల్ తీస్తున్నారు. గమనించిన సత్యనారాయణ వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ముగ్గురు యువకులు పారిపోగా.. ఇద్దరు యువకులు దొరికారు.
గ్రామస్తులు అక్కడకు చేరుకొని ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకులను పోలీస్ స్టేషన్ కి తరలించారు. విచారణ చేపట్టగా.. జువ్వలపాలెంకి చెందిన ఐదుగురు యువకులు.. బంధువుల కారు తీసుకుని షికారుకు వచ్చినట్లు.. అర్ధరాత్రి పెట్రోల్ బంకులు క్లోజ్ అయి ఉండడంతో ఓ బైక్ లోని పెట్రోల్ తీసేందుకు ప్రయత్నించారు. చివరికి గ్రామస్తులకు దొరికిపోయి తన్నులు తిన్నారు.