గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జవాద్ తుఫానుగా ఏర్పడిన సంగతి తెలిసిందే. జవాద్ తుపాను కారణంగా విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్ లో సముద్రం ముందుకొచ్చింది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్లు భూమి కోతకు గురైంది. పలు చోట్ల భూమి కుంగిపోయింది. దీంతో సమీపంలోని పిల్లల పార్కు ప్రహరీ గోడ కూలిపోయింది. బల్లలు విరిగాయి.. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో పార్కుకు వచ్చే రహదారుల్ని అధికారులు మూసివేశారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు.
ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్ద రాకపోకలపై నిషేధం విధించారు. విశాఖలోని నోవాటెల్ హోటల్ ముందుభాగంలో బారికేడ్లు పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీచ్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతే కాదు ఇక్కడికి పర్యాటకుల ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. జవాద్ తుపాను వాయుగుండంగా మారి దిశను మార్చుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఇది ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ వాయుగుండం స్థిరంగా కదులుతున్నట్లు చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. నేడు (ఆదివారం) మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ తీరాన్ని ఈ వాయుగుండం తాకొచ్చని అంచనా వేశారు. ఇది మరింత బలహీనపడి అల్ప పీడనంగా మారొచ్చని కూడా చెబుతున్నారు. జవాద్ తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతంలోని ప్రధాన కార్యాలయం తూర్పు నౌకాదళ కమాండ్, నావికాదళ అధికారులు సన్నాహక కార్యకలాపాలు చేపట్టిన విషయం తెలిసిందే.