పుత్రుడు అంటే ‘పున్నామ నరకం’ నుంచి కాపాడేవాడని అర్ధం. అందుకే సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన నేటికి కొడుకు కావాలని చాలా మంది తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. కొడుకు కోసం ఎన్నో పూజలు, వత్రాలు చేస్తుంటారు. తాము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కంటి రెప్పలా కాపాడి, చనిపోయిన తరువాత తమ చితికి కొడుకు నిప్పు పెడితే చాలని కోరుకుంటారు. అయితే కొందరు కుమారులు తమ తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారు. తాజాగా ఓ కుమారుడు కాస్తులిస్తేనే చితికి నిప్పు పెడతాను అనే స్థాయికి దిగజారాడు. పెంచి పెద్ద చేసిన తండ్రి చితికి నిప్పు పెట్టేందుకు ఆ కుమారుడు బేరాలు మాట్లాడాడు. చివరకు చేసేది లేక కుమార్తె ఆ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దారుణమైన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడుకు చెందిన గింజుపల్లి కోటయ్య(80)కి ఒక కుమారుడు, కుమార్తె. ఆ ఇద్దరు పిల్లలను చిన్నతనం నుంచి ఏ కష్టం లేకుండా పెంచి.. పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా చేశాడు. కుమార్తె విజయలక్ష్మిని పక్కనే ఉన్న గుమ్మడిదుర్ర అనే గ్రామంలోని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కోటయ్య.. కుమారుడి వద్దనే ఉండేవాడని సమాచారం. ఈక్రమంలోనే ఆస్తి విషయంలో తండ్రీకొడుకల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇలా వారి మధ్య గొడవలు జరుగుతున్న సమయంలోనే కోటయ్యకు ఉన్న భూమిని సుమారు కోటి రూపాయలకు విక్రయించాడు. అందులోని రూ. 30 లక్షలు తన వద్ద ఉంచుకుని మిగిలిన సొమ్మును కుమారుడి కి ఇచ్చారు.
కోటయ్య వద్ద ఉన్న సొమ్మును కూడా ఇవ్వాలని ఆయన కొడుకు తరచూ గొడవ పడుతుండే వాడు. ఈ నేపథ్యంలో కుమారుడు వేధింపులు తట్టుకోలేక భార్యతో కలిసి కోటయ్య గుమ్మడిదుర్రులోని కుమార్తె విజయలక్ష్మి ఇంటికి వెళ్లారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన కోటయ్య శుక్రవారం మృతిచెందారు. తండ్రి మరణవార్తను కుటుంబ సభ్యులు కుమారుడికి చెప్పారు. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేందుకు కోటయ్య కొడుకు నిరాకరించాడు. తండ్రి వద్ద ఉన్న డబ్బులు ఇస్తేనే ఆయన చితికి నిప్పు పెడతానని భీష్మించాడు. కనీసం కన్నతండ్రి కడసారి చూపు చూసుకునేందుకు కూడా రాలేదు.
దీంతో చాలా సమయం పాటు కొడుకు వస్తాడని ఎదురు చూసి.. చేసేది లేక కుమార్తె విజయలక్ష్మి తండ్రి కర్మకాండ పూర్తి చేశారు. తండ్రి చితికి నిప్పుపెట్టకుండా కాసుకు కక్కుర్తిపడిన ఈ పుత్రరత్నంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పుత్రులు పుట్టినా ఒకటే.. గిట్టినా ఒకటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు కూడా కొడుకు, కుమార్తె పట్ల వ్యత్యాసలు చూపించవద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.