ఆమె నవమాసాలు మోసింది. నరక వేదనను అనుభవించి పిల్లలకు జన్మినచ్చింది. చిట్టి మాటలతో అమ్మా అని పిలిచినప్పుడు సంబరపడింది. అలా పిల్లల బరువును మోసిన ఆమె.. నేడు ఆ బిడ్డలకే భారమైంది.
ఈ భూ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది మరేది లేదు. కన్నపేగుబంధం, అనుబంధానికి సాటి మరేదీ రాదు. పిల్లలను తల్లి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది. నవమాసాలు మోసి.. నరక వేదన అనుభవిస్తూ పిల్లలకు జన్మనిస్తుంది. బిడ్డలు వచ్చీరాని మాటలతో ‘అమ్మా’ అని పిలిస్తే.. తెగ సంబర పడుతుంది. తాను ఎన్ని కష్టాలైనా భరిస్తుంది.. కానీ బిడ్డలకు చిన్న కష్టం వచ్చిన తల్లడిల్లిపోతుంది. అలా తన రెక్కల కష్టంతో బిడ్డలను పెంచి పెద్దవారిని చేసి.. ఓ ఇంటి వారిని చేస్తుంది. నవమాసాలు వారి బరువు మోసిన తల్లి.. వృద్ధ్యాప్యంలో బిడ్డలకు బరువైంది. తాజాగా ఓ వృద్ధురాలిని రహదారి పక్కన వదిలేసి వెళ్లారు వారి కుటుంబ సభ్యులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల నుంచి జొన్నలగడ్డకు వెళ్లే మార్గంలో నాలుగు రోజుల కిందట ఓ 80 ఏళ్ల వృద్ధురాలిని కొందరు వదిలి వెళ్లారు. అప్పటి నుంచి ఆమె ఎండలో ఇబ్బంది పడుతూ, రాత్రుల్లో చలికి వణుకుతూ ఆకలితో ఎంతో బాధ పడుతుంది. చాలా మంది ఆమెను చూసి.. తమకేమి పట్టనట్లు వెళ్లిపోయారు. అయితే కొందరు స్థానికులు అటుగా పొలానికి వెళ్తూ ఆ పెద్దావిడను పలకరించే వారు. అలానే ఆమెకు అన్నం, నీరు అందిస్తూ బాగోగులు చూసేవారు. ఇదే సమయంలో ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ పెద్దావిడ చాలా నీరసంగా ఉండంటంతో నోటమాట సరిగా రాలేదు.
దీంతో వారు ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అన్నం పెట్టి..సపరివర్యాలు చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వృద్ధురాలి వద్దకు చేరుకుని ఆమెను శుక్రవారం ఉజ్వల హోమ్ కు తరలించారు. ఆమె వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మానవత్వం, పేగు బంధం కనుమరుగై పోతున్నాయనే భావన కలుగుతుందని స్థానికులు అంటున్నారు. ఆ తల్లి ఎంతో కష్టపడి పెద్దవారిని చేస్తే… వృద్ధాప్యంలో ఆమె బరువైందా? అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఇలా తల్లిదండ్రులను రోడ్లపై వదిలేసే బిడ్డలను ఏం చేయాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.