తల్లిదండ్రులు దైవంతో సమానం అనే విషయం ప్రతి ఒక్కరి తెలుసు. వారిని క్షేమంగా చూసుకోవడం దైవ పూజతో సమానమని పెద్దలు అంటుంటారు. కానీ కొందరు పుత్రులు.. తల్లిదండ్రులకు అన్నం పెట్టరు కానీ దేవుళ్లకు పాలాభిషేకాలు చేస్తుంటారు. అలాంటి ఓ కొడుకు, కోడలికి కోర్టుకు అదిరిపోయే తీర్పు ఇచ్చింది.
ఈ భూ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించి విలువైనది మరొకటి ఉండదు. భూమిపై పడిన నాటి నుంచి బిడ్డను కంటికి రెప్పలా తల్లి కాపాడుకుంటుంది. ఎన్నో కష్టాలు పడుతూ, సకల సుఖాలు వద్దులుకోని బిడ్డ ఆనందం కోసమే అమ్మ ఆరాట పడుతుంది. తాను ఆకలితో ఉంటూ బిడ్డలకు కడుపు నిండా అన్నం పెడుతుంది. ఇలా తమను పెంచి పెద్ద చేసిన తల్లి పట్ల కొందరు బిడ్డలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తనను పెంచిన అమ్మను మరచి, భార్య, పిల్లలపై ప్రేమలు చూపిస్తుంటారు కొందరు పుత్రులు. తమ పట్ల కుమారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నా కొందరు తల్లిదండ్రులు మౌనంగా భరిస్తుంటారు. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు, కోడళ్లకు కోర్టులు బుద్ధి చెప్తున్నాయి. తాజాగా వృద్ధాప్యంతో బాధపడుతున్న ఓ తల్లిని పట్టించుకోని కొడుకు, కోడలకి కోర్టు అదిరిపోయే శిక్ష వేసింది. మరి కోర్టు ఏం శిక్ష వేసింది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం దర్గావీధికి చెందిన ఓ వృద్ధురాలిని.. ఆమె కుమారుడు కోడలు సరిగ్గా చూసుకోవడం లేదని సమాచారం. దీంతో చాలా కాలం కొడుకు, కోడలి వేధింపులను ఆ తల్లి భరిస్తూ వచ్చింది. అయితే నవమోసాలు మోసి పెంచిన కొడుకు.. తనను భారంగా భావిస్తున్నాడని ఆ తల్లి ఆవేదన చెందింది. తనను కొడుకు, కోడలు పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు వచ్చింది. ఈ క్రమంలో గతేడాది ఆమె వృద్ధుల సంక్షేమ ట్రైబ్యునల్, సబ్ డివిజనల్ మేజిస్ట్రే కోర్టును ఆశ్రయించారు. తనను కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదని బాధితురాలు పిటిషన్ వేసింది. దీనిపై అప్పట్లోనే విచారణ చేసిన సబ్ కలెక్టర్ సూర్యతేజ బాధితురాలికి నివాసం, జీవన భృతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మార్వో, ఎస్సైలను ఆదేశించారు.
అయితే ఈ ఆదేశాల అమలుకు ఆ వృద్దురాలి కొడుకు, కోడలు సహకరించలేదు. ఈక్రమంలో బాధితురాలు మరోసారి ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. విచారించిన ట్రైబ్యునల్ ఛైర్మన్, సబ్ కలెక్టర్ సూర్యతేజ నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో బాధితురాలికి ఇంటిని అందించాలని, అక్కడ ఆమె నివసించడంతో పాటు వచ్చే ఇంటి అద్దె ఆమెకే చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రైబ్యూనల్ తీర్పును పాటించని ఆమె కుమారుడు, కోడలికి రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. మరి.. తల్లిని పట్టించుకోని కొడుకు, కోడళ్లకి ఇలాంటి శిక్షలే వేయ్యాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.