నేటి సమాజంలోని చాలా మంది యువతలో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. సమస్యలను ఎదిరించి పోరాడే స్థైర్యం తగ్గిపోతుంది. అన్ని అవసరాలు సకాలం తీరుతుంటే తప్పా.. ఏ చిన్న సమస్య వచ్చిన తట్టుకోలేక పోతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులు ఓ చిన్న మాట అన్నా కూడా పిల్లలు మనస్తాపానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు మందలించిన సమయంలో క్షణికావేశానికి గురై.. నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. వారు మరణించడంతో పాటు కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. చేతికి అందివచ్చిన కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయి గూడెంకు చెందిన పసుపులేటి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి దంపతులు స్థానికంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయికి వివాహం చేయగా, రెండో కుమార్తె హరీష(20) డిగ్రీ చదువుతోంది. నందిగామలోని ఓ ప్రైవేటు కాలేజీలో హరీష డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది. తోటి విద్యార్థులతో ఎంతో కలసిమెలసి ఉండే హరీష, చదువులోనూ ముందుండేది. అయితే ఆమెను అప్పుడప్పుడు అనారోగ్యాలు వెంటాడేవి. అలానే ఇటీవల హరీష కు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కాలేజికి రోజూ వెళ్లడం లేదు. తల్లిదండ్రులు అడగ్గా అనారోగ్యంగా ఉందని చెప్పేది. ఈ నేపథ్యంలోనే హరీషను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన హరీష్ జనవరి1 గడ్డి మందు తాగింది.
అయితే హరీషను గమనించిన ఆమె తల్లిదండ్రులు వెంటనే నందిగామ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు విజయవాడకు తరలించమని చెప్పారు. దీంతో వైద్యుల సూచన మేరకు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ హరీష మంగళవారం మృతి చెందింది. కూతురు మృతితో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరీ.. తల్లిదండ్రులు మందలించారని, మార్కులు తక్కువచ్చాయని.. ఇలా ప్రతి చిన్న విషయానికి మనస్తాపం చెంది.. ఎందరో తమ నిండు జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.