తిరుమల గదుల బుకింగ్స్, లడ్డూ ప్రసాద వితరణలో టీటీడీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు భక్తులు ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతతో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నారని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ధర్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తిరుమలలో గదుల బుకింగ్స్‌తో పాటు లడ్డూ ప్రసాద వితరణ తదితర అంశాల్లో తెచ్చిన మార్పులు, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు. గదుల కోసం సామాన్య భక్తులు ఎవరైతే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటున్నారో.. వారే ఉపవిచారణ కార్యాలయాల్లో గదులు పొంది, ఖాళీ చేసే టైమ్‌లోనూ నేరుగా వెళ్లి ఖాళీ చేస్తేనే కాషన్ డిపాజిట్ రీఫండ్ చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.
నెలకు ఒక్కరికి ఒక్కసారి మాత్రమే గదులు కేటాయిస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే టీటీడీకి సంబంధించిన గదులు పొందేందుకు చాన్స్ ఉంటుందని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తిరుమలలో గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా రూ.2.95 కోట్ల రాబడి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అడ్వాన్స్ బుకింగ్, కరెంట్ బుకింగ్లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నామని వ్యాఖ్యానించారు. వసతి గదుల కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా సీఆర్వో దగ్గరకు మార్చనున్నట్లు తెలిపారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూ ప్రసాద వితరణలోనూ ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టామని ఈవో ధర్మారెడ్డి వివరించారు.
క్యూకాంప్లెక్స్‌లో ఇకపై లడ్డూలు కావాలంటే మనిషి రావాల్సిందేనన్నారు. మనిషి లేకుండా లడ్డూ రాదని ఆయన వెల్లడించారు. కాగా, నెలకు ఒక్కరికి ఒకేసారి తిరుమలలో గదులు కేటాయిస్తామని తిరుమల తిరుపతి బోర్డు స్పష్టం చేయడంపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరునిన్రవూరులోని చారిత్రక పురాతనమైన భక్తవత్సల పెరుమాళ్ ఆలయానికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి పాల్గొన్నారు. పెద్దజీయర్‌స్వామి ఈ దేవాలయానికి ఆధ్యాత్మిక పెద్దగా వ్యవహరిస్తున్నారు. స్వామివారి కోరిక మేరకు 2010 సంవత్సరం నుంచి ఈ ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ శ్రీవారి కానుకగా పట్టువస్త్రాలు సమర్పిస్తూ వస్తోంది. మరి, తిరుమల గదుల బుకింగ్స్ విషయంలో టీటీడీ తీసుకొచ్చిన మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.