ఏపీ, తమిళనాడుకి మరో తుఫాన్ రానుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అటు తమిళనాడు, ఇటు ఏపీ చిగురుటాకుల వణుకుతున్నాయి. తమిళనాడులో అయితే పరిస్థితి మరి ఘోరంగ ఉంది. జోరుగా కురుస్తున్న వర్షాలకు స్టాలిన్ ప్రభుత్వం స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. ఇదిలా ఉండగానే మరో తుఫాన్ దూసుకొస్తుందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడి, ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. అయితే దీని కారణంగా రానున్న రెండు మూడు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇది తుఫానుగా కూడా మారే అవకాశముందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. అయితే దూసుకోస్తున్న ఈ తుఫాన్ కు జవాద్ పేరు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక కుండపోతతో తడిసిముద్దవుతున్న ఏపీ సహా తమిళనాడుకు మరో హెచ్చరికలు రావటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.