భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని చిన్న కొత్తపల్లి మండలం వెల్దూర్తి సమీపంలోని చిత్రావతి నదిలో కారు, ఆటో చిక్కుకున్నాయి. దీంతో ఆ వాహనాల్లో ఉన్న పది మంది నదిలో ఉండిపోయారు. కారులోని నలుగురిని పోలీసులు రక్షించారు. ఆటోలో ఉన్న ఆరు మంది రక్షించేందుకు నదిలోకి జేసీబీని పంపించారు అధికారులు.
కానీ అప్పటికే వరద ఉద్దృతి ఎక్కవ కావడంతో ఆరుగురితో ఉన్న జేసీబీ కూడా పూర్తి స్థాయిలో నదిలో చిక్కుకుంది. కాపాడటానికి వెళ్లిన జేసీబీలోని నలుగురు, ఆటోలోని ఆరుగురు నదిలో ఉండిపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు కరెంట్ ను నిలిపివేశారు. విద్యుత్ తీగల సాయంతో పోలీసులు, రెస్యూ టీమ్ ఆపరేషన్ చేపట్టం జరిగింది. భారీ విద్యుత్ తీగల నుంచి తాడు సాయంతో వారి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు రెస్యూ టీమ్. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రావల్సిందిగా రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అధికారులను కోరారు.
కాగా, అన్నమయ్య, ఫించ ప్రాజెక్టుల కట్టలకు గండ్లు పడ్డాయి. చెయ్యేరు నది దిగువకు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. నదీ పరివాహక ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పశువులు, వాహనాలు కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి వరదలకు అతలాకుతలం అవుతున్నాయి.