ఏపిలో అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు రక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులకు ముందు సభలో విజిల్స్ వేశారు.. ఆ తర్వాత సభలోకి చిడతలు తెచ్చారు. ఇవాళ ఏకంగా తాళిబొట్లతో నిరసనకు దిగారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ఇవాళ ఉభయ సభల్లోకి తాళి బొట్లతో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలిలో తాళిబొట్టు ప్రదర్శిస్తున్న బచ్చుల అర్జునుడు చేతిలో నుంచి వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తాళిబొట్టు లాగేసుకున్నారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. పోడియం వద్దకు చేరుకుని తాళిబొట్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు తీరు మార్చుకోకపోవడంతో 8 మంది ఎమ్మెల్సీలను మండలి నుంచి ఛైర్మన్ సస్పెండ్ చేశారు. ఇలా రోజుకో విధంగా సభలో నిరసనలు వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురవుతున్నారు. ఇవాళ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనలతో ఛైర్మన్ మండలిని వాయిదా వేశారు.