‘సింగర్ పార్వతి’ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. తన పాటతో ఊరి కలను నిజం చేసింది. ఎన్నో కష్టాలు పడి అక్కడిదాకా వెళ్లింది. కానీ, అవకాశం వచ్చాక తన కోసం ఏం కోరుకోలేదు. తన ఊరి వాళ్ల కల తీర్చాలని నిర్ణయించుకుంది. తను పడిన కష్టం తన ఊరిలో ఇంకెవరూ పడకూడదని భావించింది. మా ఊరికి బస్సు తెప్పించండి చాలు అని కోరింది. ఆ మాటకు కార్యక్రమంలోని జడ్జ్ లే కాదు.. ఏపీ మంత్రి మనసు కూడా చలించి పోయింది. వెంటనే లక్కసాగారానికి బస్సు వచ్చింది. డోన్ డిపో నుంచి లక్కసాగరానికి బస్సు సర్వీసు ప్రారంభం అయ్యింది.
ఏపీ మంత్రి పేర్ని నాని.. పార్వతి పాట, మాటకు చలించిపోయారు. వెంటనే ఆ ఊరికి బస్సు సర్వీసు ప్రారంభించాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో ఏళ్ల నుంచి ఆ ఊరి వాళ్లు ఎదురుచూస్తున్న కల రోజుల్లోనే నిజం అయ్యింది. డోన్ డిపో లక్కసాగరం గ్రామానికి ఊదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు బస్సు సర్వీసు ప్రారంభించారు. అందరిలా మా ఊరికి కూడా బస్సు ఉండాలి. మేము కూడా కాలి నడక కాదు.. బస్సులో తిరగాలని ఎదురు చూసిన ఆ గ్రామస్థుల కల నెరవేరింది. పార్వతి సంపన్న కుటుంబం నుంచి రాలేదు. ఒక చిన్న వ్యవసాయ కుటుంబం. కానీ, తన కోసం కాకుండా ఊరి కోసం ఆమె కోరుకోవడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.
సరిగమప న్యాయనిర్ణేతల్లో ఒకరైన స్మిత.. పార్వతిని పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఆమె మంచి మనసు నన్ను కట్టిపడేసింది. ఆమె అంత కష్టపడి సంగీతం నేర్చుకుంది. జీవితంలో ఇక్కడి దాకా వచ్చేందుకు ఎంతో కష్టపడింది. కానీ, నీకేం కావాలో కోరుకో అనగానే.. తనకంటూ ఇది కావాలి అని కోరుకోలేదు. మా ఊరికి బస్సు కావాలి అంది. అంతేకాకుండా నాకు గుర్తింపు వచ్చాక మా ఊరిలోని పేద పిల్లలకు చదువు చెప్పిస్తానంటోంది. అంటే తన ఆలోచన తన గురించి కాదు. ఎప్పుడు ఊరు, ఊరిలో పిల్లలు, జనం ఇలానే ఉంది. ఆమెను చూస్తే నాకు ముచ్చటేస్తోంది’ అంటూ స్మిత మెచ్చుకున్నారు.
తమ ఊరికి బస్సు రావడంపై దాసరి పార్వతి, గ్రామస్థులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కల్మషంలేని పార్వతి మనసును ఊరంతా కొనయాడుతున్నారు. ఒకప్పుడు పార్వతిని హేళన చేసిన వారే.. ఇప్పుడు పార్వతి తమ పాలిట దేవత అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.