ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మొరపెట్టుకుంటున్నా.. కొంత మంది వినిపించుకోవడం లేదు. అతి వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్య ధోరణితో వాహనం నడపడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు రక్తమోతున్నాయి. అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.ఈ ప్రమాదాల కారణంగా పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యం సేవించి వాహనం నడపడం, వేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం తిరుపతికి సమీపంలోని ధర్మాపురం వద్ద ఆయిల్ ట్యాంకర్, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగపూర్ నుండి తమిళనాడులోని చెన్నై వచ్చిన ఓ కుటుంబం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు కారులో బయలు దేరింది. కారు ధర్మాపురం వద్దకు రాగానే.. ఎదురుగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీ కొంది. ఈ ఘటనతో ఆయిల్ ట్యాంకర్‌లోకి కారు చొచ్చుకుపోయింది. ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.