ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. పైగా ఈ కరోనా వల్ల కూడా చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దీనికి తోడు.. చాలా మంది ఉన్నత విద్యావంతులు తాము చదివిన చదువుకు చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఉంది. పీజీలు, పీహెచ్‌డీలు చేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారు ఎందరో. ఇలానే పెద్ద చదువు చదివి చిన్న ఉద్యోగానికి వచ్చిన మహిళ గురించి తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.
నెల్లూరు జిల్లా కావలి ఆర్డీవో కార్యాలయంలో అంగన్‌వాడీ పోస్టులకు, ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ చెప్పిన సమాధానంతో అధికారులు.. ఆమె ధ్రువీరణ పత్రాలు పరిశీలించకుండానే మీరు వెళ్లండమ్మా.. అని అన్నారు. అల్లూరు బీసీ కాలనీ అంగన్‌వాడీ కేంద్ర ఆయా పోస్టు కోసం ముగ్గురు పోటీపడ్డారు. శాంతకుమారి ఎం.కాం పూర్తి చేసి.. ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెను జేసీ గణేష్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. మీరు ఏం చదివారు అని జేసీ ప్రశ్నించగా.. శాంతకుమారి ఎంకామ్ అని చెప్పింది.
అంత చదువు చదివి ఇంత చిన్న పోస్టుకు ఎందుక అప్లయ్ చేశారేంటమ్మా..? ఇంత చిన్న పోస్టులో పనిచేయడం ఇబ్బంది కదా..? అని అడిగారు. కుటుంబ పరిస్థితులు వల్ల ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నానని.. భవిష్యత్‌లో అంగన్‌వాడీ టీచర్‌గా ఉద్యోగోన్నతి వస్తుందని ఆలోచనతో ఇంటర్య్వూకు వచ్చినట్లు శాంతికుమారి చెప్పారు. అంత చదువు చదివిన మీతో.. ఆయా పనులు చేయించలేం.. అంటూ ఆమె ధ్రువీకరణ పత్రాలు పరిశీలించకుండానే ఆమెను మీరు వెళ్లవచ్చు అంటూ జేసీ చెప్పారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.