Kadapa : రాజకీయాలకు ఎప్పుడూ ప్రధాన కేంద్రంగా ఉండే వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న తరుణంలో జరిగిన ఈ పరిణామాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ప్రజాస్వామ్యయుతంగా నామినేషన్లు వేసి ప్రచారానికి సిద్ధమవుతున్న YCP అభ్యర్థుల ఇళ్లను టార్గెట్ చేసుకుని దుండగులు భయానక విధ్వంసానికి పాల్పడ్డారు. ఇళ్ల ముందు నిలిపిఉంచిన భారీ వాహనాలకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు పులివెందులలో అర్ధరాత్రి ఏం జరిగింది? ఈ దాడుల వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి?
పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పలువురు అభ్యర్థులు ఉత్సాహంగా తమ నామినేషన్లను దాఖలు చేశారు. అయితే రాజకీయ కక్షలు లేదా ప్రత్యర్థుల పనేమో గానీ, అర్ధరాత్రి వేళ పులివెందుల పట్టణంలో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీకి చెందిన 30వ వార్డు వైసీపీ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ఇంటి వద్దకు అర్ధరాత్రి సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు అత్యంత వ్యూహాత్మకంగా చొరబడ్డారు. ఆయన నివాసం ముందు పార్క్ చేసి ఉన్న రెండు భారీ లారీలను లక్ష్యంగా చేసుకుని వాటికి నిప్పు పెట్టారు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఎగసిపడి ఆ రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో ఒక భయానక వాతావరణాన్ని తలపించింది.
అంతటితో ఆగని దుండగులు అదే రాత్రి పులివెందులలో మరో ప్రాంతంలో కూడా తమ రాక్షస క్రీడను కొనసాగించారు. మరో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి అయిన అంజనప్ప ఇంటి వద్ద కూడా ఇదే తరహాలో దాడికి తెగబడ్డారు. ఆయన నివాసం ముందు సురక్షితంగా నిలిపిఉంచిన బైక్ ను సైతం పూర్తిగా దగ్ధం చేశారు. ఒకే రాత్రి ఇద్దరు అధికారిక అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాలను టార్గెట్ చేసి ఇలా వరుసగా తగలబెట్టడం వెనుక పక్కా రాజకీయ కుట్ర ఉన్నట్లు స్పష్టమవుతోంది.
