ఆదివారం పల్నాడు జిల్లాలో కలకలం రేపిన ఎనిమిదేళ్ల చిన్నారి కిడ్నాప్ కథ సుఖాతం అయింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలుడిని సురక్షితంగా కాపాడారు. 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును చేధించారు. నిన్న సాయంత్రం రాజీవ్ సాయిని కిడ్నాపర్లు అపహరించారు. దుండగులు కోటి రూపాయలు ఇస్తేనే బాలుడిని ప్రాణాలతో వదిలేస్తామని ఫోన్ లో బెదిరింపులకి పాల్పడ్డారు. దీంతో కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు బాలుడి కుటుంబ సభ్యులు. తమ కుమారుడిని ఏమి చేయొద్దని, అడిగినంత ఇస్తామని దుండగులను వేడుకున్నారు. అయితే పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకుని కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటకు చెందిన రాజీవ్ సాయి(8) గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. రాజీవ్ తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్నారు. దసరా పండుగ కోసం వీరి కుటుంబం చెన్నై నుంచి చిలకలూరిపేటకు వచ్చింది. పట్టణంలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో ఆదివారం రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేశారు. అనంతరం ఇంటికి వచ్చే సమయంలో.. బాలుడుని దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇస్తే ప్రాణాలతో వదిలేస్తామని బెదిరించారు. డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాణాలతో తమ బిడ్డను కాపాడని వేడుకున్నారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలను కొనసాగించారు.
తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కిడ్నాప్ కు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చివరకి ఆ కిడ్నాపర్లను నెల్లూరు జిల్లా కావలి వద్ద అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని ప్రాణాలతో కాపాడి.. తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులకు రుణపడి ఉంటామని ఆ బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఈ కిడ్నాపర్లు నార్త్ ఇండియాకు చెందిన వారిగా గుర్తించారు. మొత్తానికి పల్నాడు జిల్లాలో కలకలం రేపిన రాజీవ్ సాయి కిడ్నాప్ కథ సుఖాతం అయింది. రాజీవ్ సాయి ప్రాణాలతో తిరికి రావడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.