టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం కుప్పంలో ఆయన యాత్ర ప్రారంభం అయింది. నారా లోకేష్.. నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలతో కలిసి అక్కడి గుడిలో ప్రత్యేక పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. యాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గురువారం పాదయాత్ర ద్వారా ఆయన పలమనేరులోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పలమనేరులో పోలీసులకు, లోకేష్ బృందానికి మధ్య చిన్న గొడవ చోటుచేసుకుంది. క్లాక్ టవర్ వద్ద సభకు అనుమతి లేదని పోలీసులు లోకేష్‌ను అడ్డుకున్నారు. ప్రచార వాహనం మైక్‌ను వాడటాన్ని వారు తప్పు బట్టారు. దీంతో పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డితో నారా లోకేష్ వాగ్వివాదానికి దిగారు.
నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. వాహనాన్ని సీజ్ చేశారు. దీంతో పరిస్థితి కొంత అదుపుతప్పింది. అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తర్వాత పరిస్థితులు మామూలు అయ్యాయి. అయితే, లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం ఓర్వలేకపోతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే యాత్రకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. మరి, నిబంధనలను ఉల్లంఘించారంటూ పలమనేరు పోలీసులు నారా లోకేష్‌కు నోటీసులు ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.