రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన విశాఖ గర్జనకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఓపైవు జోరుగా వర్షం కురుస్తున్నప్పటికి.. లెక్క చేయక.. ఉత్సాహంగా గర్జనలో పాల్గొని వికేంద్రీకరణకు మద్దతిస్తున్నారు. అంతేకాక విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ.. జేఏసీ ఆధ్వర్యంలో.. భారీ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీ అనంతరం ‘విశాఖ గర్జన’ సభ జరగనుంది.
విశాఖ గర్జన ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాసంఘాల నేతలు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ ర్యాలీలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. విశాఖలో భారీ వర్షం కురుస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి గర్జన ర్యాలీలో పాల్గొనడం కోసం ప్రజలు భారీగా తరలి వచ్చారు. మరోవైపు విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి రహదారులు అన్ని జలమయం అయ్యాయి. విశాఖ గర్జన ర్యాలీ, బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.