ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరుతో నిత్యం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే. “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమం మంచి విజయాన్ని సాధించడంతో మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఈ బాటే పడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి లోకి నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా వచ్చి చేరారు.
నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం “గుడ్ మార్నింగ్” పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈయన పట్టణంలోని వార్డుల్లో పర్యటిస్తూ.. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందుతున్నాయా? లేదా? అని ఆరా తీస్తున్నారు. అందని వాళ్లు తిరిగి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ విధంగా నర్సరావు పేట ప్రజలతో మమేకమవుతున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి.
ఇక ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇటీవల నర్సరావుపేటలోని 31వ వార్డులో పర్యటించారు. అక్కడ రోడ్డు పక్కనే ఆయనకి ఓ హోటల్ కనిపించింది. ఎమ్మెల్యే వెంటనే హోటల్ లోకి వెళ్లి.. దోసెలు పోస్తున్న మహిళ చేతిలోని గరిటె తీసుకొని.. ఆయనే స్వయంగా దోశెలు పోశారు. ఎమ్మెల్యే పోసిన దోశెలను ఆరగించిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు దోశెలు బాగున్నాయి సార్ అంటూ ఎమ్మెల్యేకు కితాబిచ్చారు. మరి.. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా ప్రజల్లో ఒకడిగా మారి, వారి సమస్యలు తెలుకునే ప్రయత్నం చేస్తుండటంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.