ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. పాలనలో సీఎం జగన్ విఫలమయ్యారని చెప్పారు. ఆయన మరీ ఇంతగా విఫలమవుతారని అనుకోలేదని అన్నారు. ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ కొత్త సంప్రదాయం ప్రారంభించిందని.. విపక్షం లేకుండా సభ నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని అప్పులపై నియంత్రణ లోపించిందని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం సవరిస్తూ..ఇప్పటి వరకు ఉన్న 90 శాతం రుణ పరమితిని 180 కి శాతం పెంచుకోవటాన్ని ఆయన తప్పు బట్టారు. అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. ఏపీ 6 లక్షల 22 వేల కోట్లు అప్పుల్లో ఉంది. జగన్ వచ్చాక 3 లక్షల 50 వేల కోట్లు అప్పులు చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. గవర్నెస్ అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా విఫలమయ్యారు.
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని.. మళ్లీ పెడతాం అనడం ప్రభుత్వ వైఫల్యమే. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. చంద్రబాబునుద్దేశించి అగౌరవంగా మాట్లాడుతుంటే జగన్ ఏం చేస్తున్నారు? ప్రతిపక్షం లేకుండా చేయాలనుకుంటే అంత అవివేకం ఇంకోటి లేదు. రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడగటానికి కేసుల భయం. అఖిల భారత సర్వీసు అధికారులు సైతం ప్రస్తుత పరిస్థితిపై నిర్ఘాంత పోతున్నారు అని ఉండవల్లి అన్నారు. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తూ.. కొత్త అప్పుల కోసం అన్నింటినీ ఒప్పుకుంటుందని మండిపడ్డారు. ఇలా ఇష్టానుసారం అప్పులు చేసుకుంటూ పోతే.. భవిష్యత్‌లో అప్పులు తీసుకుని పరిస్థితి ఉండదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వ పాలనలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు.