చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు చేసే హేళన భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. పలమనేరులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో పదవ తరగతి చదువుతోంది మిస్బా. తండ్రి సోడా వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తోటి విద్యార్థులు అమ్మాయి తండ్రి సోడాల వ్యాపారం పై హేళన చేశారు.
సోడా వ్యాపారం చేసేవారికి ఇలాంటి స్కూల్ అవసరమా అంటూ ఎగతాళి చేయడంతో విద్యార్థిని మిస్బా తీవ్ర మనస్తాపానికి గురైంది. అనంతరం ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో సదరు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కూతురు చనిపోయిందనే బాధతో కుటుంబీకులు బోరున విలపించారు. తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ స్కూల్ ముందు అమ్మాయి మృతదేహంతో కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు.
కూతురిని హేళన చేస్తున్న విషయంపై ఇదివరకే స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడం జరిగిందని. అయినా సరే ఈ విషయంలో స్కూల్ సిబ్బంది పట్టించుకోలేదని తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటి విద్యార్థులు కూడా ఎగతాళి చేయడం ఆపకపోవడంతో అమ్మాయి దూరమైందని విద్యార్థిని బంధువులు వాపోయారు. ప్రస్తుతం స్కూల్ ఎదుట బంధువులు, స్థానికులు ధర్నా చేపట్టారు. స్థానిక పోలీసులు కూడా అక్కడికి ఆలస్యంగా చేరుకున్నట్లు సమాచారం. మరి పదవ తరగతి బాలికకు జరిగిన అవమానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.