సంక్రాంతి అంటే ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. ఉద్యోగాలు, పనులు, ఇతర కారణాలతో ఇంటిని, అక్కడి వాతావరణాన్ని, అనురాగాలు, ఆప్యాయతలను మిస్ అవుతూనే ఉంటాం. దాంతో పండుగలు ఎప్పుడూ వస్తుంటాయా అని రెక్కలు కట్టుకుని వాలిపోయేందుకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇలాంటి విషయాలలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలేమీ అతీతం కాదు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్షనేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ ఏడాది తన స్వగ్రామమైన చిత్తుూరు జిల్లా కుప్పంలోని నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు చేసుకోనున్నారు.
గతంలో ప్రతీ సంక్రాంతికి సొంత ఊరిలో, తన బంధువుల మధ్య ఈ పండుగను జరుపుకునే వారు. కరోనా కారణంగా మూడేళ్లుగా సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటున్నారు. కానీ.. ఈసారి ఫ్యామిలీతో స్వగ్రామంలో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సంక్రాంతి సంబరాలలో నారావారి ఫ్యామిలీతో పాటు నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ కూడా జతకట్టనుందని సమాచారం. ఈ ఇరుకుటుంబాలు తరలి వస్తుండటంతో నారావారి పల్లె.. అందంగా ముస్తాబవుతోంది. చంద్రబాబు దంపతులు, బాలకృష్ణ దంపతులతో పాటు నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరంతా 12, 13వ తేదీల్లో అక్కడకు చేరుకుంటారని తెలుస్తోంది. మరి నారా, నందమూరి ఫ్యామిలీస్ సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకోనున్నాయో చూడాలి.