ఈజీ మనీ కోసం ఈ మద్య కాలంలో చాలా మంది చైన్ స్నాచింగ్, ఖరీదైన మొబైల్ చోరీలకు పాల్పపడుతున్నారు. పోలీసులు చోరీకి గురైన మొబైల్స్ ని గుర్తించి బాధితులకు అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మద్య కొంతమంది తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. చైన్ స్నాచింగ్, మొబైల్ చోరీలు, డ్రగ్స్ అమ్మకం, హైటెక్ వ్యభిచారం ఇలా ఎన్నో దందాలు చేస్తూ ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో కేటుగాళ్ళ ఆట కట్టిస్తున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో వరుసగా మొబైల్స్ చోరీ అయ్యాయి. చోరీకి గురైన మొబైల్స్ రికవరీ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లాలో ఇటీవల కొంతమంది ఖరీదైన సెల్ ఫోన్లు దొంగిలించబడ్డాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు మొబైల్ హంట్ సేవలు వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు విడతల్లో దాదాపు 664 సెల్ ఫోన్ లు పోగొట్టుకున్నట్లు మొబైల్ హంట్ లో నమోదు అయ్యింది. ఇక మొబైల్ హంట్ యాప్ ద్వారా గుర్తించిన రూ.65 లక్షల విలువైన 270 సెల్ ఫోన్లు బాధితులకు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి అందజేశారు. ఈ యాప్ ద్వారా మొబైల్ చోరీ చేసిన వ్యక్తుల నుంచి రికవరీ చేసుకొని బాధితులకు అందజేస్తున్నారు.
మొబైల్ హంట్ యాప్ ద్వారా ఇప్పటి వరకు రూ.1.6 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో మొబైల్స్ అవసరం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎంతో ఇష్టపడి కొన్న మొబైల్ చోరీకి గురి అయితే చాలా కష్టం అనిపిస్తుంది. అలాంటి సమయంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్ తిరిగి పొందగలిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ క్రమంలోనే పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు.. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను తిరిగి అందించడమే మొబైల్ హంట్ ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. చోరీకి గురైన సెల్ ఫోన్ వివరాలు మెసేజ్ పంపితే చాలు.. దాన్ని రికవరీ చేసి తిరిగి అందిస్తామని అన్నారు. పోగొట్టుకున్న తమ సెల్ ఫోన్లు తిరిగి పొందడంతో బాధితులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.