వేప చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. వేప అనేది 4000 సంవత్సరాలకు పైగా భారతదేశంలో వాడబడుతున్న ఒక ఔషధ మూలిక. వేప చెట్టు యొక్క అన్ని భాగాలు వివిధ రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి, వేప కూడా అరిష్ట అనగా “అనారోగ్యం యొక్క ఉపశమనం” అనే సంస్కృత పేరుతో పిలువబడుతుంది. అందుకే కొన్ని చోట్లు వేప చెట్టుకి పూజలు చేస్తూ వాటికి ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో ఒక వేప చెట్టు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఈ సందర్బంగా ఆ చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు గ్రామస్థులు. నూతి సత్యనారాయణ అనే వ్యక్తి వందేళ్ల క్రితం శ్రీ రాజగోపాల స్వామి దేవాలయం ఎదురుగా ఒక చిన్న వేప చెట్టు నాటారు. అక్కడే ఒక రచ్చబండ కూడా ఏర్పాటు చేశారు.
ఆయన మొక్కని నాటిన తేదిని ఒక శిలాఫలకం పై చెక్కించారు. లక్ష్మీప్రదాతగా భావించిన స్థానికులు నాటి నుంచి పూజలు చేస్తున్నారు. ఈ చెట్టుకు వంద సంవత్సరాలు రావడంతో గ్రామ ప్రజలు ఆ చెట్టుకు జన్మదిన వేడుకలు నిర్వహించాలని భావించారు. ఇంకేముంది అనుకున్నదే తడువుగా ఆ వేపచెట్టుకుగ్రాండ్ గా పుట్టిన రోజు వేడుకలు చేశారు.
వేప చెట్టుకి కొత్త పట్టు చీర కట్టి లక్ష్మీదేవిలా అలంకరించారు. తాము నిర్వహిస్తున్న వేడుకకు సంబంధించి ఒక కరపత్రాన్ని ముద్రించి ఊరంతా పంచారు. వేడక జరుపుతున్న సమయానికి భక్తులు వచ్చి నైవేద్యాలు, కానుకలు సమర్పించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తామని సత్యనారాయణ వారసులు తెలిపారు.