అమారవతి- స్మార్ట్ ఫోన్ వినియోగంతో అత్యాధునిక టెక్నాలజీ మన అరచేతిలోకి వచ్చింది. దాంతో ఇంట్లో కూర్చునే అన్ని పనులు చక్కబెడుతున్నాం. గ్యాస్ బుక్ చేయడం, కరెంట్ బిల్లు కట్టడం, ఆన్ లైన్ షాపింగ్ ఇలా అన్ని పనులు చక్కబెడుతున్నాం. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంతో రాష్ట్రంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెర తీసింది. ఎవరి ఇంటి మీటర్ కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ నూతన సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీని ప్రకారం స్మార్ట్ ఫోన్ తో కరెంట్ బిల్లు కడుతున్నట్లుగానే.. అదే ఫోన్ తో మీటర్ రీడింగ్ కూడా తీయోచ్చు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ కొత్త సాంకేతికత పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీడర్ ద్వారా జరుగుతోంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మీటర్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినా వేరే మార్గం లేకపోవడంతో సిబ్బంది ప్రజల ఇళ్లకు వెళ్లి వారే రీడింగ్ తీస్తున్నారు. గత రెండు వేవ్ లలో కరోనా బారిన పడి పలువురు స్పాట్ బిల్లింగ్ రీడర్లు ప్రాణాలు కోల్పోయారు. మూడో వేవ్ తరుముకొస్తున్న నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు మీటర్ రీడింగ్ పై ఆందోళన వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా రీడింగ్ తీయడం కాస్త ఆలస్యమైతే.. స్లాబ్ మారి బిల్లు ఎంత వస్తుందోననే భయం ఉంది.
దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మీటరు రీడింగ్ తీసుకుని పంపితే.. ఈ-బిల్లు మీ కళ్ల ముందు ఫోన్ లో ప్రత్యక్షం అవుతుంది. దాన్ని బట్టి.. బిల్లు పే చేయోచ్చు. ఈ విధానాన్ని ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అందుబాటులోకి తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌లు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
రీడింగ్ ఇలా..
ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్టర్ సర్వీస్ నంబర్‌పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్ చేయాలి. దానిని సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఈ యాప్‌లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన సాంకేతికతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.