ఎంతగానో ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేసాయి. మరి ఫలితాలను ఎలా చూసుకోవాలి? ఎక్కడ చూసుకోవాలి? అలానే సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి? అనే వివరాలు మీ కోసం.
పబ్లిక్ పరీక్షలు రాసినప్పుడు కంటే ఫలితాలు వచ్చినప్పుడే ఆ ఆనందం అనేది రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఈ ఆనంద క్షణాల కోసం విద్యార్థులు కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. ఫలితాలు ఎంత త్వరగా వస్తాయా అని ఆసక్తిగా పడిగాపులు కాస్తుంటారు. అయితే విద్యార్థుల ఎదురుచూపులు ఇవాళ నిజం అయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,05,052 మంది హాజరు కాగా.. వీరిలో 3,09,245 మంది బాలురు, 2,95,807 మంది బాలికలు ఉన్నారు.
అయితే ఏపీ పదో తరగతి పరీక్షల్లో బాలికలే పై చేయి సాధించారని బొత్స సత్యనారాయణ తెలిపారు. బాలుర ఉత్తీర్ణత 69.27 శాతం కాగా.. బాలికల ఉత్తీర్ణత 75.38 శాతం అని పేర్కొన్నారు. మొత్తంగా పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ నెల 13 వరకూ గడువు ఉందని అన్నారు. జూన్ 2 నుంచి 10 వరకూ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందని, దీని కోసం ఈ నెల 17 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. మార్కులు తక్కువ వచ్చినా, ఫెయిల్ అయినా ఎలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు కోరింది.