ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ ఓవైపు ఉద్యోగులు ఉద్యమం చేస్తుండగా, ఏపీ సర్కార్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తోంది. నూతన పీఆర్సీ అమలుపై పట్టుదలగా ఉంది. ఆ దిశగా తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు, డీడీఓలకు సర్క్యూలర్ జారీ చేసింది ఆర్థికశాఖ. ఓవైపు పీఆర్సీ సాధన కమిటీతో ప్రభుత్వం చర్చలు జరుపుతుండగానే.. మరోవైపు ఆర్థిక శాఖ సర్క్యూలర్ జారీ చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. తమకు పాత జీతాలే ఇవ్వాలని.. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇస్తే తీసుకునేది లేదని వెల్లడిస్తున్నారు. ఒక్కసారి జీతాలు తీసుకుంటే ప్రభుత్వ నిర్ణయానికి అంగీకారం తెలిపినట్లే అని భావిస్తోన్న ఉద్యోగులు.. పాత జీవో ప్రకారమే వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.
ఏపీ సచివాలయం, హెచ్‌వోడీలు, ట్రెజరీలు, అకౌంట్స్ అండ్ పే, డీడీవోలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. 2022 జనవరి శాలరీని ఉద్యోగులకు సంబంధిత డీడీవోల ద్వారా రివైజిడ్ పే స్కేల్ 2022ను అనుసరించి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి రివైజిడ్ కంసాలిడేటెడ్ పెన్షన్, బెనిఫిట్‌లను డీడీవోల ద్వారా చెల్లించాలని సూచించింది.
మిగిలిన కేటగిరి ఉద్యోగులు అందరికీ సీఎఫ్‌ఎంఎస్, ఆప్‌కోస్ ద్వారా రివైజిడ్ పే స్కేల్స్‌ను పీఆర్‌సీ జీవో ప్రకారం అందించాలని ఆర్థిక శాఖ అదేశించింది. ట్రెజరీ ఆఫీసుల్లోని డిస్బర్సింగ్ ఆఫీసర్లు ఈ సూచనలు పాటిస్తూ జీతాలు చెల్లింపు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.అటు.. పీఆర్సీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టు వీడటం లేదు. ఉద్యోగ సంఘాలు బెట్టు దిగడం లేదు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు మళ్లీ వాయిదా పడ్డాయి. జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని చెప్పడం సమంజసం కాదని ప్రభుత్వం అంటుంటే.. జీవోలను వెనక్కి తీసుకుంటేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మరి ఈ వివాదానికి ఎప్పుడు శుభం కార్డు పడుతుందో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.