జగన్ ప్రభుత్వం ఈసారి వార్షిక బడ్జెట్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసింది. ఎన్నికల ఏడాది కావడంతో అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్‌ను రూపొందించింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఏయే శాఖలకు ఎంత ఇచ్చారంటే..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా జనరంజకంగా బడ్జెట్‌ను జగన్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈసారి బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. నవరత్నాలకు ప్రాధాన్యం ఇస్తూనే విద్య, వైద్యంతో పాటు మిగిలిన రంగాలకూ మునుపటి కంటే భారీగా కేటాయింపులు చేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టిన ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లు. కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.28 లక్షల కోట్లుగా ఉంది. ఇక బడ్జెట్‌లో జగన్ సర్కారు సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు చేసింది. సంక్షేమ పథకాల కేటాయింపుల విషయానికొస్తే.. పేదలందరికీ ఇళ్ల కోసం రూ.5,600 కోట్లు కేటాయించారు.
ఈసారి బడ్జెట్‌లో పరిశ్రమలు, వాణిజ్యానికి రూ.2,602 కోట్లు, నీటి వనరుల అభివృద్ధికి రూ.11,908 కోట్లు, జగనన్న విద్యా కానుకకు రూ.560 కోట్లను జగన్ ప్రభుత్వం కేటాయించింది. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కోసం రూ.15,873 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి కోసం రూ.9,381 కోట్లు.. వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.15,882 కోట్లను కేటాయించారు. డీబీటీ పథకాలకు మొత్తంగా రూ.54,228.36 కోట్లు కేటాయించామని మంత్రి బుగ్గన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్కు రూ.1,166 కోట్లు, షెడ్యూలు కులాల కాంపొనెంట్‌కు రూ.20,005 కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.21,434.72 కోట్లు, వైఎస్ఆర్ కల్యాణమస్తు స్కీముకు రూ.200 కోట్లు, వైఎస్‌ఆర్ ఆసరా పథకానికి రూ.6,700 కోట్లును కేటాయించామని ఆయన పేర్కొన్నారు.
సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధి మీద కూడా వైసీపీ ప్రభుత్వం ఈసారి శ్రద్ధ పెట్టింది. దీనికి గణాంకాలను ఉదాహరణగా చెప్పొచ్చు. ఈసారి బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం రూ.38,605 కోట్లు కేటాయించారు. గతేడాది బీసీ వెల్ఫేర్‌కు రూ.29,143 కోట్లు కేటాయించారు. అంటే ఈసారి 32.5 శాతం ఎక్కువగా కేటాయింపులు జరిగాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు ఈసారి బడ్జెట్‌లో రూ.9,381 కోట్లు కేటాయించారు. అదే 2022–23లో రూ.8,796 కోట్లు కేటాయించారు. దాంతో పోలిస్తే ఈసారి 6.6 శాతం ఎక్కువగా కేటాయింపులు జరిగాయి. అలాగే రోడ్లు భవనాల కోసం రూ.9,118 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువని చెప్పాలి. అలాగే విద్యారంగానికి 7 శాతం, ఆరోగ్య రంగానికి 3.2 శాతం, వ్యవసాయ రంగానికి కూడా గతేడాదితో పోలిస్తే 3 శాతం ఎక్కువగా కేటాయింపులు జరిగాయి.