గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ తిరుగుతున్నారు అన్న వార్తలు ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది తెలంగాణలో పలు ప్రాంతాల్లో చెడ్డీగ్యాంగ్ హల్ చల్ చేశారు. వీరి మకాం ఇప్పుడు ఏపికీ మార్చారు. మోస్ట్ డేంజరస్ గా చెప్పుకునే చెడ్డీగ్యాంగ్ ఏపీలో తిరుగుతున్నారని సమాచారం అటు ప్రజలకు, పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవటం కోసం రంగంలోకి దిగారు. విజయవాడ, గుంటూరులో యథేచ్ఛగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యుల్లో కొందరు పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది.
ఈ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని గుజరాత్‌లోని దాహోద్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మిగిలిన వారి ఆచూకీ కోసం వారిని ప్రశ్నిస్తున్నారు. కాగా, చెడ్డీ గ్యాంగ్ నేరాలు చేసే విధానం విలక్షణంగా ఉంటుంది. గతంలో జరిగిన నేరాలు దర్యాప్తు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ మూలాలు ఉన్నట్టు గుర్తించారు. చెడ్డీగ్యాంగ్‌లో ఒక్కో దాంట్లో ఐదుగురు చొప్పున రెండు ముఠాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రవేశించిన ఈ గ్యాంగ్ గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లా నుంచి వచ్చినట్టుగా విజయవాడలో జరిగిన ఘటనల ఆధారంగా ధ్రువీకరించుకున్నారు. చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఉపయోగించిన ఫోన్ల ఆధారంగా వీరి ఆచూకీని కనిపెట్టినట్టు సమాచారం. సీసీ కెమెరాలు, గతంలో నేరాల ఆధారంగా చెడ్డి గ్యాంగ్ సభ్యులు గుజరాత్‌కి చెందిన వారీగా గుర్తించారు పోలీసులు. ఇటీవల చెడ్డీ గ్యాంగ్ ఫోటోలు కూడా విడుదల చేశారు. కాగా, గుజరాత్ లో రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. త్వరలోనే ముఠాలోని కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.