ఏటికేడాది రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి గానీ తగ్గట్లేదు. ప్రభుత్వాలు తగు ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితం ఉండట్లేదు. తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. ఎక్కడో చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా, ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద నేషనల్ హైవేపై యాక్సిడెంట్ జరిగింది. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు ధర్మవరం దగ్గర ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన బస్సు ముందు ఉన్న మరో ఆటోను ఢీకొట్టి పంటకాలువలోకి దూసుకెళ్లింది.
ధర్మవరం వద్ద ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికుల సాయంతో అక్కడి నుంచి నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి ఆటోల్లో తరలించారు. విశాఖపట్నంలోని ఇసుకతోటకు చెందిన పరసయ్య (55) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స తర్వాత వారిని మెరుగైన ట్రీట్మెంట్ కోసం వైజాగ్ కేజీహెచ్‌కు తరలించారు.