సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఆత్మహత్య కాదు. కారణం ఏదైనా చాలా మంది ఆత్మహత్యనే సరైన మార్గంగా భావిస్తున్నారు. కొందరైతే అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో కూడా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం జేఎన్టీయూలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మిత్రులకు బాయ్ అని సందేశం పంపి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం తెల్లవారుజామున హాస్టల్ భవనం పైనుచి దూకి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్న చాణక్య నందారెడ్డి (19) గా గుర్తించారు. వర్సిటీలోని ఎల్లోరా భవనం పైనుంచి దూకి చాణక్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి కారణాలు తెలియరాలేదు. రాత్రి వరకు ఎంతో సంతోషంగా ఉన్నాడని తెలుస్తోంది.
చాణక్య సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెండ్స్ ఫోన్ కు బాయ్ అని మెసేజ్ పెట్టినట్లు గుర్తించారు. మొదటి సంవత్సరంలో చాణక్యకు 9.8 జీపీఏ వచ్చినట్లు తెలుస్తోంది. చదువులో ఒత్తిడి వల్లనా? లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. చాణక్య నందారెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లాగా తెలుస్తోంది. విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో బలవన్మరణాల సంఖ్య పెరిగిపోతోంది. విద్యార్థులు కూడా ఊరికే ఒత్తిడికి లోనవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.